వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబే కాబోయే సీఎం అని… ఆయన అనుభవం ఏపీకి కావాలని జనసేనాని పవన్ కూడా చెప్పారు. అందరి మాట ఇదేనని టీడీపీ యువనేత నారా లోకేశ్ కూడా అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య లేఖ రాశారు. 

లోకేశ్ చెపుతున్నట్టుగా ఐదేళ్ల పాటు చంద్రబాబును సీఎంగా చేసేందుకు మీరు కూడా ఒప్పుకున్నారా? అని లేఖలో పవన్ ను జోగయ్య ప్రశ్నించారు. జనసైనికులంతా మీరే సీఎం కావాలని కోరుకుంటున్నారని… మీరు సీఎం కాకపోతే వారి కలలు ఏం కావాలని ప్రశ్నించారు. మీకు ఓట్లేస్తే చంద్రబాబు సీఎం అవుతారనేదాన్ని జనసైనికులు ఒప్పుకోలేరని అన్నారు. మీరు నీతివంతమైన పాలన అందిస్తారని భావించే ప్రజానీకానికి మీరు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. రెండు కులాల నాయకులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నారని… బడుగు, బలహీనవర్గాలకు మోక్షం ఎప్పుడని అడిగారు.