విద్యుత్ రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ గత ప్రభుత్వంపై ప్రస్తుత ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తప్పులు జరినట్టు మీరు భావిస్తుంటే జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… గౌరవ సభ్యుడే డిమాండ్ చేశారు కాబట్టి జ్యుడీషియల్ విచారణ జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అసెంబ్లీ వేదికగా చెపుతున్నా… మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయిస్తామని చెప్పారు. 

విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న అవకతవకలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలనే శ్వేతపత్రాన్ని విడుదల చేశామని రేవంత్ తెలిపారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మీ ఉద్దేశాలు ఏమిటో విచారణలో తేలుతాయని చెప్పారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. కేంద్రం తక్కువ ధరకు విద్యుత్ ఇస్తున్నా… అధిక ధరకు ఛత్తీస్ ఘడ్ ను విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. రెండో అంశంగా 1,080 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, మూడో అంశంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై విచారణకు కూడా ఆదేశిస్తున్నామని చెప్పారు.