జహీరాబాద్ నియోజవర్గం జిడిగి గ్రామానికి చెందిన సొన్నాయిల ప్రశాంత్, భార్య లినోరా ఇద్దరు పిల్లలు హెబ్సిబా గ్రేస్, తేజశ్వినితో కలిసి ఫిబ్రవరి 29న జహీరాబాద్‌లోని బంధువుల ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు వెళ్లి రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా కర్ణాటకకు చెందిన బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని సంగారెడ్డిలోని బాలాజీ ఆస్పత్రికి తరలించారు. ప్రశాంత్‌కు అక్కడే చికిత్స అందించగా అతడి భార్య, ఇద్దరు పిల్లలను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ప్రమాద విషయాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గాలి అనిల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు హుటాహుటిన కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి ఆరా తీశారు. తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గాలి అనిల్‌కుమార్ రూ.4లక్షలు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. అడగగానే ఆర్థికసాయం చేసిన గాలి అనిల్‌కుమార్‌కు, హరీశ్‌రావుకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.