విద్యార్థులను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లి కొట్టడం దేశ చరిత్రలో తెలంగాణలోనే జరిగిందని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన గురువారం మాట్లాడుతూ… కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులతో దారుణంగా కొట్టించిన ఘటనను దేశం మొత్తం చూస్తోందన్నారు. విద్యార్థులను కొట్టిన తీరు చూసి న్యాయమూర్తే ఆశ్చర్యపోయారని, విద్యార్థులను ఇంత తీవ్రంగా కొట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని చురకలు అంటించారు.ఒక ఎమ్మెల్సీ ప్రాపకంతో కేయూ వీసీగా వచ్చిన రమేశ్ విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారి హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. విద్యార్థుల డిమాండ్లకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామన్నారు. కేయూలో పీహెచ్‌డీ అడ్మిషన్స్‌లో అవకతవకలు జరిగాయని ఏబీవీపీ, ఇతర బీసీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయని, దీంతో పదిమంది విద్యార్థులను టాస్క్ ఫోర్స్ పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు.ఈటల ఇంకా మాట్లాడుతూ… తెలంగాణలో హోంగార్డుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. వారి వేతనాలు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. స్కూల్ ఫీజులు అయితే భారీగా పెరిగాయని, నియంత్రణ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వల్ల తెలంగాణ రైతులు ఎగవేతదారులుగా మిగిలారని మండిపడ్డారు. రుణమాఫీ కింద కట్టింది కేవలం రూ.12వేల కోట్లు మాత్రమే అన్నారు. సమయానికి డబ్బులు చెల్లించకపోవడం వల్ల రైతుల వడ్డీ పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.