మెగాస్టార్ చిరంజీవి ఎన్నోరకాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ట్రస్ట్ ద్వారా ఆయన బ్లడ్, ఐ బ్యాంకులను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… తాను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించిన ఆనాటి క్షణాలను గుర్తు చేసుకుంటున్నానని చెప్పారు. సమాజ సేవలో ఇదొక అద్భుతమైన జర్నీ అని అన్నారు. ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్ల బ్లడ్ సేకరించామని, వాటిని అవసరమైన వారికి అందించామని చెప్పారు. ఐ బ్యాంక్ ద్వారా 10 వేల మందికి కంటి చూపునిచ్చామని తెలిపారు. చిరంజీవి ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు తమ వంతు సాయం చేస్తున్న అక్కాచెల్లెళ్లు, అభిమానులకు, సోదరులకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. మన దేశానికి మనం చేస్తున్న చిరు సాయమిదని అన్నారు. సాయం చేస్తే వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేవని తెలిపారు.