టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి దగ్గరైన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఇప్పటివరకు చంద్రబాబు కాళ్లు… రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్లు అని ఒకప్పుడు నన్ను ఉద్దేశించి ట్వీట్ చేశావ్. వైసీపీ మీద, విజయసాయిరెడ్డి మీద పోరాడేది నువ్వో, నేనో ప్రజలకు తెలుసు అని ఆ రోజు నేను ట్వీట్ చేశాను. ఎవరేంటి అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైంది” అని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. 
‘టీడీపీలో ఒక వెలుగు వెలిగిన నువ్వు ఇప్పుడెలాంటి వాళ్ల మధ్య ఉన్నావో చూసుకో… ఇంత బతుకు బతికి ఇంటి వెనుక చచ్చినట్టుంది నీ బతుకు’ అంటూ బుద్ధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడ స్వరాజ్య మైదాన్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వచ్చారు. వారి వెంట కేశినేని నాని కూడా కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ట్వీట్ చేసిన బుద్ధా వెంకన్న పై వ్యాఖ్యలు చేశారు.