రేవంత్ రెడ్డి అంగీకరిస్తే ఆయన కథతో సినిమాను తీస్తానని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. బుధవారం ఏబీఎన్ లైవ్ డిబేట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రేవంత్ రెడ్డికి ఎంతోమంది విలన్‌లు ఉన్నారని, వారంతా ఆయనను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బంది ఎదుర్కొన్న చోటనే ఆయన నాయకుడిగా ఎదిగారన్నారు. ఇప్పుడు అధికారం చేపడుతున్నారని కితాబునిచ్చారు. రేవంత్‌కు ఆకలి, కసి, కష్టం, పాలన తెలుసునని చెప్పారు. తెలంగాణలోని వివిధ జిల్లాలలో విజయం సాధించిన కాంగ్రెస్‌ గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు గెలవకపోవడం బాధించిందన్నారు.

రానున్న ఎన్నికల్లో హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అద్భుత పాలన చేస్తుందని.. హైదరాబాద్ వాసులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎక్స్ వేదికపై కేటీఆర్ గన్ పట్టుకుని ఉన్న ఫోటో చూసి భయపడ్డానని… కౌంటింగ్ కేంద్రాల దగ్గర అలర్టుగా ఉండమని కార్యకర్తలకు చెప్పానన్నారు.