ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశంసించారు. ఈ మేరకు బీజేపీ నేత… సీఎంకు లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో ప్రస్తావించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.5.04 లక్షలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

నీలోజిపల్లి నుంచి నందిగామ అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సహా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు అర్హత లేకున్నప్పటికీ మిడ్ మానేరు ప్యాకేజీ పరిహారం తీసుకున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు తక్షణమే సంబంధించిన శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.