ఏపీలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరుకుంది. పురపాలక సంఘాల్లోని పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ సిబ్బంది తమ డిమాండ్ల సాధన కోసం రెండు వారాలుగా పోరాటం సాగిస్తున్నారు. 

కాగా, నేడు హిందూపురంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న శిబిరానికి స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొన్న ఆయన వారికి సంఘీభావం తెలియజేశారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… వైసీపీ పాలనలో  ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఉరవకొండలో జర్నలిస్టులపై దాడి వైసీపీ పైశాచికత్వానికి నిదర్శనం అని మండిపడ్డారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. వైసీపీ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని బాలకృష్ణ స్పష్టం చేశారు.