టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రాథమిక ఆధారాలను కూడా చూపించకుండానే అర్ధరాత్రి వేళల్లో అరెస్ట్ చేసే విధానాన్ని ఏపీలో అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది విశాఖపట్నంలో జనసేనపై పోలీసు వ్యవస్థ ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారని చెప్పారు. ఏ తప్పూ చేయని జనసేన నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, అన్యాయంగా జైళ్లలో పెట్టారని దుయ్యబట్టారు. ఇప్పుడు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సంఘటన కూడా అలాంటిదేనని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేన సంపూర్ణంగా ఖండిస్తోందని పవన్ చెప్పారు. పాలనాపరంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘటనను చూసినా… శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు వరుసగా చెపుతున్నారని… లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది పోలీసులని… ఈ విషయంలో మీ పార్టీకి సంబంధం ఏమిటని మండిపడ్డారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని అన్నారు. ఒక పార్టీ అధినేత అరెస్టయితే వాళ్ల పార్టీ నేతలు, కార్యకర్తలు, కేడర్ మద్దతుగా రావడం సహజంగా జరిగే పనేనని… నాయకుడి కోసం అందరూ వస్తారని, ప్రజాస్వామ్యంలో ఇది భాగమని పవన్ చెప్పారు. ఇళ్ల నుంచి వాళ్లు బయటకు రాకూడదు, రోడ్ల మీదకు రాకూడదు అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైళ్లలో మగ్గిపోవచ్చు… అయినా విదేశాలకు వెళ్లే అవకాశం మీకుంటుందని దుయ్యబట్టారు. నాయకుడు అరెస్టయినప్పుడు పార్టీ నేతలు ఇంట్లో నుంచి కూడా బయటకు రాకూడదని అనుకుంటే… దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ ను శాంతిభద్రతల అంశంగా కాకుండా, వైసీపీ రాజకీయ కక్ష సాధింపు అంశంగానే జనసేన చూస్తోందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, దీన్నుంచి ఆయన త్వరగా బయటపడాలని కోరుకుంటున్నానని చెప్పారు.