ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై విచారణను ఏసీబీ న్యాయస్థానం రేపటికి (గురువారానికి) వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబును కోర్టుకు తీసుకు రావాలని సీఐడీ తరఫు న్యాయవాది పీపీ వివేకానంద కోర్టును కోరారు. పీటీ వారెంట్‌పై సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ప్రధాన ముద్దాయి అని, ఈ కేసులో రూ.115 కోట్ల నిధుల గోల్ మాల్ జరిగినట్లు సిట్ దర్యాఫ్తులో వెల్లడైందన్నారు.ఫైబర్ నెట్ అంశంలో చంద్రబాబు పాత్రను గుర్తించిన తర్వాతే ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్లు తెలిపారు. టెర్రా సాఫ్ట్‌కు అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేసేందుకు అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ న్యాయవాది అన్నారు. టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువును వారం రోజులు పొడిగించారన్నారు. ఈ అంశంలో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించిందన్నారు. చంద్రబాబు తన ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు.