ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రెండో రోజు సీఐడీ విచారణ ముగిసిన అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సరదాగా బదులిచ్చారు. లంచ్ కు ముందు ఇవాళ తనకు బాహుబలి సినిమా చూపించారని అన్నారు. “నా ముందు గూగుల్ ఎర్త్ తెరిచారు. హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన 9 ఎకరాల భూమి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పై ఎలా ఉంటుందో చూపించారు. ఆ విధంగా చూడడం నాకు మొదటిసారి. హెరిటేజ్ నాడు ఎన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేసిందీ, ఏ సర్వే నెంబరు అనేది నాకు తెలుసు. కానీ ఇవాళ బాహుబలి సినిమా చూపించినట్టు పెద్ద స్క్రీన్ పై నీట్ గా చూపించారు. దాంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే… ఇన్నర్ రింగ్ రోడ్డు హెరిటేజ్ భూముల లోపల నుంచి వెళుతుందట. దానర్థం, ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల హెరిటేజ్ భూమిని కోల్పోయింది… ఇదీ ఇవాళ నేను తెలుసుకున్నది. మొత్తమ్మీద బాహుబలి సినిమా చూపించారు… దాని తర్వాత బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఏవేవో ప్రశ్నలు అడిగారు.