ఉద్యోగం చేసుకోవటానికి ఓ జంట తమ బిడ్డను దత్తత ఇవ్వాలనుకుంటున్నట్టు సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేశారు.. వినటానికి వింతగా ఉన్నా ఈ వార్త నిజం.. సాధారణంగా పెళ్లి చేసుకున్న ఏ జంటైనా తమకు బిడ్డ పుడితే ఆనందంతో మురిసిపోతారు.. ఎప్పుడెప్పుడు ఆఫీస్ పని ముగించుకుని ఆ బిడ్డతో ఆడుకోవాలనే, తమ ఒడిలో ఆడించాలనో ఉవ్విళ్ళూరుతారు.. కానీ ఇక్కడ ఓ జంట మాత్రం తమ ఉద్యోగానికి భారంగా ఉందని కన్న బిడ్డనే దత్తత ఇవ్వాలనుకోవటం ఇప్పుడు వైరల్ గా మారింది.. ఈ వార్త విన్న ఎవరైనా ఇదేం పోయేకాలమని ముక్కున వేలేసుకుంటున్నారు.. అసలు విషయానికి వస్తే సామజిక మాధ్యమం రెడిట్ వేదికగా ఓ జంట తమ మూడు నెలల కుమార్తె ఎలిజబెత్ ను దత్తత ఇస్తామని పోస్ట్ చేసింది. దీనికి వాళ్ళు చెప్పిన కారణం తమ ఉద్యోగాల వల్ల టైం లేక పాపను చూసుకోలేకపోతున్నారట.. పాపను చూసుకోవటానికి టైం లేనప్పుడు మరి ఎందుకు కన్నారో అని ఈ వార్త విన్న కొందరు అనుకుంటున్నారు. తన భార్య చిన్నారికి పాలు పట్టడం , దుస్తువులు మార్చటం, స్నానం చేయించటం తప్ప ఇంకేమి చేయలేదని చిన్నారి తండ్రి పేర్కొనటం విడ్డూరం. బిడ్డ పుట్టిన రెండు వారాలకే తన భార్య విధుల్లో చేరిందని జాబ్ పట్ల ఆమెకు అంత నిబద్దత అని ఆ భర్త పేర్కొన్నాడు .. అదే నిబద్దత పాపను పెంచే విషయంలో తల్లిదండ్రులిద్దరికీ ఉండాలని ఆ జంట తెలుసుకోలేకపోయారు. తమ ఉద్యోగాల కోసం పాపను అమ్మమ్మ కానీ మరే ఇతరులు కానీ దత్తత తీసుకోవాలని వారు కోరుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు తల్లిదండ్రులు ఉద్యోగం చేసేదే పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నత చదువులు చదివించి వారికి మంచి భవిష్యత్ ఇవ్వటానికే కదా .. ఈ చిన్న విషయం తెలుసుకోకుండా వాళ్ళు పెళ్లి చేసుకోవటం ,పాపను కనటం ఎందుకని కూడా మరికొందరు మండిపడుతున్నారు .