బ్యాంకుల నుంచి రుణాలు ఎలా తీసుకోవాలో, వాటిని ఎలా దారి మళ్లించాలో, ఆ తర్వాత ఎలా ఎగ్గొట్టాలో మర్మం తెలిసిన వ్యక్తి. అధికార పార్టీ అండ కూడా దండిగా ఉంది. అందుకే, రూ.67 కోట్ల రుణం తీసుకొని ముంచేసినా క్లీన్‌చిట్ అందుకున్నాడు. ఈ కేసును మూడేండ్లు విచారించిన సీబీఐ ఇప్పుడు దాన్ని మూసేయాలని కోర్టుకు నివేదించింది.ముంబైకు చెందిన వ్యాపారి, బీజేపీ నేత మోహిత్ కంబోజ్ భారతీయ ఎండీగా ఉన్న ఆవ్యాన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఇప్పుడు బగ్ల ఓవర్సీస్) సంస్థ 2014లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.67 కోట్ల రుణం తీసుకున్నది. ఈ రుణానికి మోహిత్ వ్యక్తిగత పూచీకత్తుగా ఉన్నాడు. ఈ రుణాన్ని దుర్వినియోగం చేశారని 2015లో బ్యాంకు గుర్తించింది. 2017లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా రుణం మొత్తా న్ని దారి మళ్లించి ముంబైలోని బాంద్రాలో ఖరీదైన ఫ్లాట్ కొన్నట్టు బ్యాంకు గుర్తించింది. మరోవైపు మోహిత్ రుణ వాయిదా చెల్లింపులను ఆపేశారు. దీంతో బ్యాంకు ఈ రుణాన్ని మొండి బకాయిగా గుర్తించింది. అప్పటివరకు సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నవారంతా ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తూ జారుకున్నారు. 2019లో రూ.30 కోట్లు తిరిగి చెల్లించి బ్యాంకుతో మోహిత్ వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేసుకున్నారు. మిగతా రూ.37.2 కోట్ల బకాయిని బ్యాంకు రైటాఫ్ చేసింది.

వన్ టైమ్ సెటిల్‌మెంట్ అయిందని..
మోహిత్ రుణం తీసుకొని ఉద్దేశపూర్వకంగా మోసం చేశారని బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో 2020లో సీబీఐ విచారణ ప్రారంభించింది. మోహిత్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. 2014 జూన్‌లో మోహిత్ భార్య అక్ష రూ.22 కోట్ల విలువైన ఫ్లాట్ కొన్నట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే, ప్రస్తుతం అనూహ్యంగా ఈ కేసును మూసివేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదించింది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ అయిపోయినందున బ్యాంకు కూడా ఇందుకు అభ్యంతరం తెలపలేదు. దీంతో ఈ కేసు మూసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అంగీకరించింది. ఇక, తనపై ఎలాంటి కేసులు లేవని మోహిత్ ఘనంగా ప్రకటించుకున్నారు. కాగా, బీజేవైఎం ముంబై అధ్యక్షుడిగా మోహిత్ పని చేశారు. 2014లో దిందోషి అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీలో చేరిన తర్వాత తన పేరుకు ‘భారతీయ’ను జత చేసుకున్నారు.