ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లి వారితో పొదిలి నుంచి కాకినాడకు వెళ్తున్న బస్సు దర్శి సమీపంలో అదుపుతప్పి సాగర్ కాల్వలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 35 నుంచి 40 మంది ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంపై స్పందించిన చంద్రబాబు.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పెళ్లి బస్సు ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకందని విషాదమని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. కాగా, ప్రమాదానికి అతి వేగమే కారణమని భావిస్తున్నారు.