తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. బీఆర్ఎస్ పార్టీని గద్దెదించేది తామే అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీమాను వ్యక్తం చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతోపాటు మంగళవారం రాహుల్ గాంధీతో రాష్ట్ర ముఖ్యనేతల సమావేశం తరువాత ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఢిల్లీలో రాహుల్ తో సమావేశం తరువాత కాంగ్రెస్ నేతలు ఐక్యతారాగాన్ని అందుకున్నారు. కలిసికట్టుగా ఎన్నికల రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.