ఎడతెరిపి లేని వర్షాలతో తెలంగాణలోని నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధమయింది. మరోవైపు ప్రగతి భవన్ లో వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వమిస్తున్నారు. వరదల పరిస్థితిని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్ ను పంపించాలని సీఎన్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలిటరీ అధికారులతో చీఫ్ సెక్రటరీ సంప్రదింపులు జరిపారు. భారీ వర్షాల నేపథ్యంలో సాధారణ హెలికాప్టర్ తో సహాయక చర్యలను చేపట్టడం కష్టమవుతుంది. దీంతో సైన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. సైనికాధికారులు అనుమతించిన వెంటనే హెలికాప్టర్ తో సహాయక చర్యలను చేపట్టనున్నారు. మరోవైపు మోరంచపల్లికి ఇప్పటికే ఎన్డీఆర్ఎప్ బృందాలను తరలించారు.