లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను తమ అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు గత రెండు రోజులుగా సుదీర్ఘంగా విచారించారు. ఢిల్లీ లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగింది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కవిత విచారణ జరిగింది. మూడు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కలిశారు. ఆయనతో పాటు ,ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి , కవిత భర్త అనిల్‌ కూడా సీబీఐ కార్యాలయానికి వచ్చారు. కవితకు ధైర్యం చెప్పారు కేటీఆర్‌. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాఫ్ చాట్‌పై సీబీఐ కవితను ప్రశ్నించింది . . సోమవారం కవిత సీబీఐ కస్టడీ ముగియగానే రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా ఈ నెల 23 వరకు కవితకు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కవితను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టునుకోరగా న్యాయస్థానం తొమ్మిది రోజులు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ అనుమతి ఇచ్చింది. ఈనెల 23వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కవిత కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ అన్నారు. రెండేండ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని, వాళ్లు కొత్తగా అడిగేందుకు ఏం లేదని కవిత అన్నారు.