ప్రకాశం జిల్లా ఒంగోలులో గతరాత్రి వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడం తెలిసిందే. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం చేస్తుండగా, ఆమెను ఓ అపార్ట్ మెంట్ లోని మహిళలు  అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి వైసీపీ, టీడీపీ వర్గాలు కొట్టుకునేంత వరకు వెళ్లింది. 

బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు, టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ కూడా రంగంలోకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడుల్లో ఇరుపార్టీలకు చెందిన వారు గాయపడగా… బాధితులను పరామర్శించేందుకు బాలినేని, దామచర్ల ఒంగోలు రిమ్స్ వద్దకు వెళ్లగా, వీరి రాకతో అక్కడ ఉన్న రెండు పార్టీల కార్యకర్తలు బిగ్గరగా నినాదాలు చేశారు. రిమ్స్ వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తీవ్రంగా శ్రమించి ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడ్నించి పంపించివేశారు.