టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 150 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ ప్రత్యేక సందేశం వెలువరించారు. నాలుగేళ్ల క్రితం జ‌నం ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి క‌రోనా వైర‌స్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన జ‌గ‌నోరా వైర‌స్ సోకిందని తెలిపారు. 

రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా, విధ్వంసం తీవ్ర‌స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం దోపిడీ దొంగ‌ల తీరుగా మారిందని, ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయ్యిందని విచారం వెలిబుచ్చారు. రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కేశారని మండిపడ్డారు. 

“సైకో పాల‌కుల‌పై ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేయ‌డానికి స‌రిగ్గా ఐదు నెల‌ల క్రితం కుప్పంలో తొలి అడుగు వేశాను. నా యువ‌గ‌ళం జ‌నగ‌ళ‌మైంది. యువ‌త త‌మ భ‌విత కోసం సైన్య‌మై నా వెంట న‌డుస్తున్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు చూశాను. క‌న్నీళ్లు తుడిచాను. స‌క‌ల‌వ‌ర్గాలు సైకో పాల‌న బాధితులయ్యారు. అంద‌రికీ అండ‌గా నిలుస్తామ‌ని భ‌రోసా ఇచ్చాను. అడుగ‌డుగునా అడ్డంకులు, సైకో స‌ర్కారు వేధింపుల‌ను అధిగ‌మించి యువ‌గ‌ళం పాద‌యాత్రని జ‌నం జైత్ర‌యాత్ర చేశారు. 

జ‌న‌మే బ‌ల‌మై, బ‌ల‌గ‌మై యువ‌గ‌ళం పాద‌యాత్ర 150 రోజులు పూర్తి చేసుకుంది. యువ‌గ‌ళం అప్ర‌తిహ‌త ప్ర‌యాణంలో భాగ‌మైన ప్ర‌జ‌లు, టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, యువ‌గ‌ళం క‌మిటీలు, వ‌లంటీర్లు, భ‌ద్ర‌తాసిబ్బంది, మీడియాకి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. మీ ప్రేమ‌ని పొందాను. మీ ఆప్యాయ‌త‌ని అందుకున్నాను. మీ ఆతిథ్యం స్వీక‌రించాను. మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి, అంద‌రికీ అండ‌గా నిలిచి రుణం తీర్చుకుంటాను” అంటూ పేరుపేరునా కృతజ్ఞతలుతెలిపారు.