రైతులకు ఉచితంగా కొత్త పాస్‌పుస్తకాలు.. క్యూఆర్ కోడ్‌తో భూమి వివరాలు!

PJNews | హైదరాబాద్: తెలంగాణలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమగ్ర భూసర్వే పూర్తయిన అనంతరం రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన వాటర్‌ప్రూఫ్ పట్టాదారు పాస్‌పుస్తకాలను ఉచితంగా అందించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ భూముల రీసర్వే, కొత్త పాస్‌పుస్తకాల జారీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
డిసెంబర్ చివరి నాటికి తొలి విడత
సరైన భూముల మ్యాపులు అందుబాటులో లేని 373 గ్రామాల్లో తొలివిడత రీసర్వే చేపట్టినట్లు మంత్రి తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి ఆయా గ్రామాల్లో సర్వే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 నెలల్లో సమగ్ర భూసర్వే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం మండలానికి రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.
క్యూఆర్ కోడ్‌తో భూమి మ్యాప్
కొత్త పాస్‌పుస్తకంపై ఉండే క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే భూమి సర్వే నంబర్, విస్తీర్ణం, మ్యాప్ వివరాలు తెలుసుకునేలా వ్యవస్థను రూపొందించనున్నారు. ఒకే రైతుకు వేర్వేరు సర్వే నంబర్లలో భూములు ఉన్నప్పటికీ వాటి వివరాలన్నింటినీ ఒకే పాస్‌పుస్తకంలో పొందుపరచనున్నారు.
ఇళ్ల స్థలాలకూ ప్రత్యేక గుర్తింపు
వ్యవసాయ భూములతోపాటు గ్రామాల్లోని ఇళ్లు, నివాస స్థలాలు, ఆబాదీ ఆస్తులకు కూడా సర్వే నిర్వహించనున్నారు. స్థలం ఎంత విస్తీర్ణంలో ఉన్నా మ్యాప్‌తో కూడిన గుర్తింపు పత్రం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ భూములు, ఆబాదీ ఆస్తులకు వేర్వేరు రంగుల్లో పాస్‌పుస్తకాలు జారీ చేయాలన్న ప్రతిపాదన ఉంది.
అభ్యంతరాలకు అవకాశం
సర్వే నిర్వహించే గ్రామాల ప్రజలకు ముందుగానే సమాచారం ఇవ్వనున్నారు. భూముల కొలతలు పూర్తయిన తర్వాత యజమానులకు వివరాలు తెలియజేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. రికార్డుల్లో తప్పులున్నట్లు నిర్ధారణైతే సవరణలు చేస్తారు. భూవివాదాల పరిష్కారంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు ప్రత్యక్షంగా పాల్గొనాలని మంత్రి ఆదేశించారు.
ప్రైవేటు భూవివాదాల్లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించదని, చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన వివాదాలను అధికారిక రికార్డుల ఆధారంగా పరిష్కరిస్తామని తెలిపారు.
గ్రామాల్లో భూముల హద్దులు, విస్తీర్ణంలో తేడాలతో ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ సర్వే ద్వారా ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ తేదీలు, ప్రస్తుతం ఉన్న పాస్‌పుస్తకాల విషయంలో అనుసరించే విధానంపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

ఇప్పుడే చేరండి










