మాదాపూర్‌లో గంజాయి విక్రయాలు.. స్విగ్గీ డెలివరీ బాయ్ అరెస్ట్
ప్రాంతం: Madhapur, Hyderabad
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గంజాయి విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద, నివాస గదిలో కలిపి 1,089 గ్రాముల గంజాయితో పాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన బలరాం మొహంతా (28) మాదాపూర్‌లోని సిద్దిక్‌నగర్‌లో నివాసం ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం ఒడిశాకు చెందిన బాబు అనే వ్యక్తి వద్ద కిలో గంజాయిని రూ.15 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.
ఆ గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.

గంజాయి విక్రయాలపై విశ్వసనీయ సమాచారం అందడంతో మాదాపూర్ పోలీసులు, డివిజన్ క్లోజ్ టీమ్ సిబ్బందితో కలిసి సిద్దిక్‌నగర్ రోడ్ నంబర్ 4లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన బలరాం మొహంతాను అదుపులోకి తీసుకుని విచారించారు.
అతని వద్ద, నివాస గదిలో కలిపి మొత్తం 1,089 గ్రాముల గంజాయి, ఒక ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.
ఇప్పుడే చేరండి









