ఘనంగా శ్రీ రామ నాటక నికేతన్ వజ్రోత్సవ వేడుకలు

ప్రాంతం: Madhapur
మాదాపూర్: భారతీయ సంప్రదాయ కళలను భావితరాలకు అందించడంలో కళా సంస్థల పాత్ర ఎంతో గొప్పదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శ్రీ రామ నాటక నికేతన్ 60 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆరు దశాబ్దాలుగా భరతనాట్యం, భారతీయ సంప్రదాయ కళల పరిరక్షణకు శ్రీ రామ నాటక నికేతన్ చేస్తున్న సేవలను అభినందించారు. సనాతన కళలు, సంస్కృతిని కాపాడటంతో పాటు వాటిని భవిష్యత్తు తరాలకు పరిచయం చేయడం అభినందనీయమన్నారు. కళలపై యువతలో ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి సంస్థలు చేస్తున్న కృషి ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

1966లో గురు వి.ఎస్. రామమూర్తి స్థాపించిన శ్రీ రామ నాటక నికేతన్ భరతనాట్య శిక్షణలో ప్రత్యేక గుర్తింపు పొందిందని నిర్వాహకులు తెలిపారు. సంస్థ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మూడు వేల మందికి పైగా విద్యార్థులకు భరతనాట్యంలో శిక్షణ అందించడంతో పాటు దేశవ్యాప్తంగా పది వేలకుపైగా నృత్య ప్రదర్శనలు నిర్వహించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం గురు మంజుల రామస్వామి ఆధ్వర్యంలో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కళాకారులు ప్రదర్శించిన ‘సంభవామి యుగే యుగే’ ప్రత్యేక నృత్య రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కళాకారుల హావభావాలు, నృత్య విన్యాసాలు, సంప్రదాయ కళారూపాల ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆరు దశాబ్దాల కళా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు, కళాకారులు, నృత్యాభిమానులు పాల్గొన్నారు. భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను కొనసాగించేందుకు సంస్థ చేస్తున్న కృషిని అతిథులు ప్రశంసించారు.
తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

ఇప్పుడే చేరండి










