నేడే రాజ్యాంగ దినోత్సవం.. ఆన్లైన్లో సర్టిఫికెట్ పొందే అవకాశం

PJNews | న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నవంబర్ 26న ప్రజలంతా రాజ్యాంగ పీఠికను చదివి ఆన్లైన్లో సర్టిఫికెట్ పొందే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ MyGov పోర్టల్‌లో ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలుగుతో పాటు రాజ్యాంగంలోని 22 షెడ్యూల్డ్ భాషలు, ఇంగ్లీష్‌లో పీఠికను చదివే అవకాశం కల్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు.
సర్టిఫికెట్ పొందడం ఎలా?
బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.
ప్రజలు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా MyGov అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఎంచుకోవాలి. అక్కడ తమకు అనుకూలమైన భాషలో రాజ్యాంగ పీఠికను చదవాలి. పోర్టల్‌లో సూచించిన ప్రక్రియను పూర్తి చేసి సర్టిఫికెట్ పొందవచ్చు. దానిని సోషల్ మీడియాలోనూ పంచుకోవచ్చు.
దేశవ్యాప్తంగా విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు
రాజ్యాంగంపై యువతకు అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. నవంబర్ 24 నుంచి 26 వరకు దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 786 జిల్లాల్లో వికసిత్ భారత్ యువ సంవాద్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక సమావేశాలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం సూచించింది. MyGov, MyBharat పోర్టళ్లలో రాజ్యాంగానికి సంబంధించిన క్విజ్ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది.
1949లో రాజ్యాంగానికి ఆమోదం
భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. అనంతరం 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 2015 నుంచి ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేసింది. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరుల బాధ్యతలపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం.
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

ఇప్పుడే చేరండి










