PJNEWSPOWER OF JOURNALISM
క్రైమ్

బాచుపల్లి ఎస్టీపీ ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.90 లక్షల పరిహారం

షేర్ చేయండి:
బాచుపల్లి ఎస్టీపీ ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.90 లక్షల పరిహారం
బాచుపల్లి ఎస్టీపీ ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.90 లక్షల పరిహారం
PJNews | బాచుపల్లి: మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున మొత్తం రూ.90 లక్షల పర…

PJNews | బాచుపల్లి: మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున మొత్తం రూ.90 లక్షల పరిహారం అందజేశారు. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు కరంసింగ్ కర్మా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనుచౌదరి గురువారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒకరికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

బాచుపల్లిలోని దినేశ్ ఆరిక్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ నెల 24న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని శుభ్రం చేస్తుండగా ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం ఘటనాస్థలాన్ని సందర్శించిన కరంసింగ్ కర్మా స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన భద్రతా పరికరాలు, యంత్రాలు లేకుండా కార్మికులను మురుగునీటి ట్యాంకులోకి దించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్మికుల మృతికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సంబంధిత ప్రైవేటు కంపెనీ డైరెక్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. కంపెనీ తరఫున కూడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

ఇప్పుడే చేరండి

కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించినంత మాత్రాన సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు తమ బాధ్యత నుంచి తప్పించుకోలేరని కలెక్టర్ మనుచౌదరి స్పష్టం చేశారు. సొసైటీల ప్రతినిధులతో కనీసం ఆరు నెలలకోసారి సమావేశాలు నిర్వహించి ఎస్టీపీలు, సెప్టిక్ ట్యాంకుల శుభ్రతలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించాలని కమిషన్ సభ్యుడు సూచించారు.

అనంతరం ఐడీఏ బొల్లారంలో నివాసముంటున్న మృతుడు సురేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

ముగ్గురు కార్మికుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనతో గేటెడ్ కమ్యూనిటీల్లో ఎస్టీపీల నిర్వహణ, పారిశుధ్య కార్మికుల భద్రత మరోసారి తెరపైకి వచ్చాయి. కార్మికులను ట్యాంకులోకి దించే ముందు భద్రతా ప్రమాణాలు పాటించారా? పనులను పర్యవేక్షించాల్సిన వారు ఎక్కడున్నారు? కాంట్రాక్టు సంస్థతో పాటు సొసైటీ నిర్వాహకుల బాధ్యత ఎంతన్నది విచారణలో తేలాల్సి ఉంది. బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన అధికారులు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడతారన్నది కీలకం.

మరిన్ని వార్తల కోసం PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

WhatsApp ఛానల్‌లో చేరండి