మిగ్జామ్ తుపానుతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రాణ ఆస్తినష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను తీవ్రత దృష్ట్యా మిగ్జామ్ ను జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు. 

లేఖలోని ముఖ్యాంశాలు

  • తుపాను వల్ల జరిగిన నష్టాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నా.
  • తుపాను కారణంగా రాష్ట్రంలోని 15 జిల్లాలు ప్రభావితమయ్యాయి.
  • 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేశాయి.
  • తుపాను కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
  • ప్రాథమిక అంచనా ప్రకారం 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
  • దీనివల్ల రూ. 10 వేల కోట్ల వరకు పంట నష్టం ఉంటుందని అంచనా.
  • పంటలు దెబ్బతినడంతో పాటు పలు చోట్ల పశువులు చనిపోయాయి, చెట్లు విరిగిపడ్డాయి. దాదాపు 770 కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
  • తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం జరిగింది. 
  • వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయింది.
  • తుపాను వల్ల పంట నష్టపోయి ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మత్స్యకార పడవలు, వలలకు కూడా నష్టం జరిగింది. వారు జీవనోపాధి కోల్పోయారు.
  • తుపాను ప్రభావం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న తమిళనాడుపై కూడా ప్రభావం చూపింది.