ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్-కరవు కవల పిల్లలు అని వ్యాఖ్యానించారు. జగన్ ఎక్కడుంటే కరవు అక్కడుంటుందని ఎద్దేవా చేశారు. రైతులను నిర్లక్ష్యం చేసిన జగన్ పనైపోయింది అని స్పష్టం చేశారు. ఐరన్ లెగ్ జగన్ ను రాష్ట్రమంతా ద్వేషిస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

కాగా, విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.1,650 కోట్లు తక్షణమే విడుదల చేయాలంటూ నారా లోకేశ్ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఫీజు బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని స్పష్టం చేశారు. 

అంతేకాదు, కాలేజీలు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. విద్యాసంవత్సరం పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని వెల్లడించారు. ఇప్పుడు కొత్తగా విద్యార్థి-తల్లి జాయింట్ అకౌంట్ అంటూ మెలికపెట్టడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు.