తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల పొట్టకొడుతూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో217ను రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. పద్ధతి ప్రకారం విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని, చెత్తపన్ను, వృత్తిపన్నులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం యువగళం క్యాంప్ సైట్ వద్దనున్న ఆయన ఈనాడు-ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఆ ఘనత టీడీపీదే
తాము అధికారంలోకి వచ్చాక చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్న ఆయన.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి చూపిస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే మళ్లీ పరిశ్రమలను తీసుకొస్తామని, ఉద్యోగాలిస్తామని, రోడ్లకు మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంపై రూ.11 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టు చెప్పారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దాదాపు 90 శాతం నెరవేర్చామని తెలిపారు. పేదల కోసం దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఏకైక పార్టీ టీడీపీయేనని స్పష్టం చేశారు.