టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ ఆయన యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం జీవీఎంసీ 82వ వార్డులో యాదవులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవులు లోకేశ్ కు తమ సమస్యలు వివరించారు. 

“టీడీపీ హయాంలో గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు. జగన్ పాలనలో గొర్రెల కొనుగోలు కోసం రుణాలు ఇవ్వడం లేదు. యాదవులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కృష్ణుడి గుడి కట్టుకోవడానికి సాయం అందించాలి. 50 ఏళ్లు దాటిన గొర్రెల పెంపకం దారులకు పెన్షన్ ఇవ్వాలి. టీటీడీ బోర్డులో యాదవులకి ప్రత్యేక స్థానం కల్పించాలి. యాదవులకు మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పించాలి. 

జగన్ ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశాడు… ఒక్క రుణం ఇవ్వడం లేదు. జగన్ పాలనలో ఒక్క యాదవ భవనం కట్టలేదు. మేము పశువులు మేపుకునే భూములు వైసీపీ ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. గొర్రెలు చనిపోతే టీడీపీ హయాంలో ఇన్స్యూరెన్స్ ఇచ్చేవారు. జగన్ పాలనలో ఇన్స్యూరెన్స్ ఇవ్వడం లేదు” అంటూ యాదవ సామాజికవర్గం ప్రతినిధులు ఆరోపించారు.