టీ కాంగ్రెస్ లో ప్రముఖ పాత్ర పోషిస్తూ.. సొంత నాయకుల తీరును ఎండగడుతూ ఎప్పుడూ హీటు పుట్టించే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఏం దరిద్రమోగానీ నిత్యమూ శీలపరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని సీనియర్‌ నేత జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మార్పు గురించి జరుగుతున్న ప్రచారం, దుష్ప్రచారం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు.AICC సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన జగ్గారెడ్డి మీడియా ముందు చెప్పలేని చాలా విషయాలు తాను రాహుల్‌ గాంధీకి తెలియజేస్తానంటూ పేర్కొన్నారు. తాను పైరవీకారుడిని కాదని, పిలిస్తేనే ఢిల్లీకి వస్తానంటూ పేర్కొన్నారు. ఏ విషయమైన అందరి ముందే చెప్తానని, ఎవరికీ భయపడను, లాలూచీ పడే వ్యక్తిని కానంటూ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇంత బతుకు బతికి కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితి చూస్తా అనుకోలేదని.. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల పరిస్థితి హైకమాండ్‌ కళ్లకుకడతానంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.