PJNews | సైబరాబాద్: ఐటీ కారిడార్‌లో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా వారం రోజుల్లో కాంట్రా ఫ్లో బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్టీఎస్) అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ వెల్లడించారు. రాయదుర్గంలోని టీ-హబ్‌లో శుక్రవారం నిర్వహించిన ‘సైబరాబాద్ మూవ్స్–2026’ రెండో రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
జేఎన్‌టీయూ నుంచి రాయదుర్గం వరకు..
జేఎన్‌టీయూ నుంచి రాయదుర్గం వరకు కాంట్రా ఫ్లో బీఆర్టీఎస్ బస్సులను నడిపేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. రద్దీ సమయాల్లో బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ప్రయాణించేలా ఈ విధానాన్ని తీసుకురానున్నారు. కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్లకు అనుసంధానం మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం.

సైబరాబాద్‌కు మరో 510 బస్సులు
రానున్న రెండేళ్లలో సైబరాబాద్ పరిధిలో అదనంగా 510 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో 450 ఏసీ బస్సులు, 60 మినీ బస్సులు ఉన్నాయి. ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నడపాలని ప్రతిపాదించింది. వివిధ ప్రజా రవాణా వ్యవస్థల అనుసంధానం కోసం ఎంఎంటీఎస్ సమాచారాన్ని ఓపెన్ డేటా తెలంగాణతో పంచుకోనున్నట్లు ఐటీ శాఖకు చెందిన రవికిరణ్ వెల్లడించారు.
ప్రజా రవాణాపై దృక్పథం మారాలి
సొంత కార్ల వినియోగంపై ఉన్న ఆసక్తి ప్రజా రవాణాపైనా పెరిగేలా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన సూచించారు. విద్యార్థులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కార్‌పూలింగ్, సురక్షిత డ్రైవింగ్, ప్రజా రవాణా వినియోగంపై చర్చించారు. విద్యార్థులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
డబ్ల్యూఆర్‌ఐ ఇండియా సీఈవో మాధవ్ పాయ్ మాట్లాడుతూ రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ట్రాఫిక్, వాయు కాలుష్యం వల్ల చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని వైద్య నిపుణులు వివరించారు. పాఠశాలల పరిసరాల్లో రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు ప్రజా రవాణాకు అనుసంధాన సదుపాయాలు పెంచాలని సూచించారు.

నవంబర్ 26 నుంచి 28 వరకు జరుగుతున్న ఈ సదస్సులో ప్రభుత్వ శాఖలు, పోలీసులు, రవాణా రంగ నిపుణులు పాల్గొంటున్నారు.


