కేరళలోని కలమస్సేరిలో ఈ ఉదయం పేలుళ్లు జరగడం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. కలమస్సేరిలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ పేలుడు జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం జంట పేలుళ్లు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.  ఈ పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ సీఎం పినరయి విజయన్ తో మాట్లాడారు. పేలుడు ఘటన, అనంతర పరిస్థితులపై సమీక్ష చేశారు. ఘటన వివరాలను సీఎం విజయన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశారు. పేలుడు ఘటన నేపథ్యంలో ఎన్ఐఏ, ఎన్ ఎస్ జీ బృందాలను కేంద్రం కేరళకు పంపింది. ఐఈడీ పదార్థాలను టిఫిన్ బాక్సులో కూర్చి పేలుళ్లకు పాల్పడినట్టు గుర్తించారు. కాగా, పేలుళ్లకు పాల్పడింది తానే అంటూ ఓ వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పేలుళ్లకు పాల్పడింది నిజంగానే అతడేనా అనే కోణంలో పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. అటు, కలమస్సేరి పేలుడు ఘటనపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు కేరళ డీజీపీ వెల్లడించారు.