రానున్న ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపిన వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం, బుధవారం, గురువారం అతి నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు హైదరాబాద్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, రేపు దాదాపు తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురువవచ్చునని తెలిపింది.అల్ప పీడన ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసి, రోడ్లు జలమయమయ్యాయి.