తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కంటోన్మెంట్ ఎమ్మెల్యే, దివంగత నేత జి.సాయన్న మృతికి సభ సంతాపం ప్రకటించింది. సాయన్నకు నివాళులు అర్పించి, ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనంతరం సభలో సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి, సభ్యులకు చదివి వినిపించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో సాయన్న వివాదరహితుడిగా, మృదుస్వభావిగా పేరొందారని చెప్పారు.  సాయన్న మృతి ఆయన కుటుంబానికే కాదు ప్రభుత్వానికి, పార్టీకి తీరని లోటు అని చెప్పారు. ఐదు పర్యాయాలు వరుసగా కంటోన్మెంట్ నుంచి ఎన్నికైన సాయన్నకు ప్రజల్లో చాలా ఆదరణ ఉందని వివరించారు. అనంతరం సాయన్నతో తమకున్న సాన్నిహిత్యంపై మంత్రులు, ప్రతిపక్ష నేతలు సభలో వెల్లడించారు. రాజకీయాలలో సాయన్న తనకు ఆదర్శమని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్ కు మంత్రి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.సాయన్నతో తనకు 32 ఏళ్ల అనుబంధం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గం చాలా పెద్దదని, అలాంటి నియోజకవర్గంలో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం సాయన్నకు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని వివరించారు. రాజకీయాల్లో ఐదుసార్లు వరుసగా గెలవడం ఆషామాషీ కాదని మంత్రి చెప్పారు. ప్రజల కోసమే తన సమయాన్ని వెచ్చించే వారని, తన ఆరోగ్యం బాగాలేకున్నా ప్రజల కోసమే తపన పడేవారని మంత్రి తలసాని చెప్పారు.

Previous article3-8-2023 TO DAY E-PAPER
Next articleతెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను ఆలింగనం చేసుకున్న కేటీఆర్!