ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి కడపకు బయల్దేరారు. ఆమెతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డిలు కూడా పయనమయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వీరు ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరారు. కడప విమానాశ్రయం నుంచి వీరు రోడ్డు మార్గంలో పయనించి సాయంత్రం 5.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ కు చేరుకుంటారు. తన తండ్రి సమాధి వద్ద షర్మిల నివాళి అర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ రాత్రికి వీరు ఇడుపులపాయలోనే బస చేస్తారు. రేపు ఉదయం విజయవాడకు చేరుకుని, ఏపీసీసీ చీఫ్ గా ఆమె బాధ్యతలను స్వీకరిస్తారు. మరోవైపు షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.