తెలంగాణలో గత కొద్ది రోజులుగా కేబినెట్ విస్తరణపై జోరుగా చర్చ నడుస్తోంది . ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అధిష్ఠానంతో నామినేటెడ్ పోస్టులు, టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపైనే ప్రధానంగా చర్చించారని వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ విషయంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రోజున మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్‌లో మంత్రి రాజనర్సింహా.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ మార్పులో భాగంగా.. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందని రాజనర్సింహా లీక్ చేశారు .కాగా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌కు కూడా కేబినెట్‌ విస్తరణలో భాగంగా చోటు దక్కనున్నట్టు మంత్రి చెప్పారు. నిజామామాద్ జిల్లా నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు తెలిపారు. త్వరలోనే వైద్య శాఖలోనూ ప్రక్షాళన ఉంటుందని తెలిపారు. అయితే.. వలస వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఉండవని పార్టీ నేతలు పదే పదే లీకులు ఇచ్చినా.. కండువా కప్పుకునేటప్పుడు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నెరవేర్చనున్నట్టు తెలుస్తోంది.కేబినెట్ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తున్న సమయంలో.. మంత్రి దామోదర్ రాజనర్సింహా చేసిన వ్యాఖ్యలు.. సర్వత్రా చర్చనీయాశంగా మారాయి