జగన్ పాలన కంటే ఉత్తర కొరియా కిమ్ పాలన బెట్టర్ అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్ట్ పూర్తిగా కక్షసాధింపు చర్య అన్నారు. టీడీపీ అధినేత అరెస్ట్ తర్వాత ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, అదే సమయంలో చంద్రబాబుపై సానుభూతి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం తీరు సభ్యసమాజం బాధపడేలా ఉందన్నారు. దురదృష్టం ఏమంటే ఈ అరెస్ట్ వెనుక జగన్‌కు బీజేపీ మద్దతుగా నిలుస్తోందనే దుష్ప్రచారం సాగుతోందని, కానీ ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు.
చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదన్నారు. చిత్తూరు వైసీపీ ఎంపీ చెప్పిందాంట్లో నిజం లేదన్నారు. ఇదంతా వైసీపీ కుట్ర అన్నారు. జగన్ ప్రభుత్వం మరో ఆరు నెలలు మాత్రమే ఉంటుందని, ఆయన విధానాలు ప్రజలకు విసుగెత్తించాయన్నారు. ఏం మాట్లాడాలన్నా భయమేస్తోందని, తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారన్నారు. గతంలో కనీసం నోటీసులు ఇచ్చేవారని, ఇప్పుడు అలాంటిదేమీ లేకుండానే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసులో ఇరికిస్తున్నారన్నారు.