ఉత్తరప్రదేశ్ సీఎం, బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌ యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ఎన్నికైన ఆరు నెలల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగం అవుతుందని అన్నారు. పీవోకేని రక్షించుకోవడం పాకిస్థాన్‌కు ఇబ్బందికరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

‘‘ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కాపాడుకోవడం పాకిస్థాన్‌కు సంక్లిష్టంగా మారింది. మోదీని మూడోసారి ప్రధాని కానివ్వండి. ఆరు నెలల్లో పీవోకే భారత్‌లో భాగమవుతుంది. ఇలాంటి పని చేయాలంటే ధైర్యం ఉండాలి’’ అని సీఎం యోగి అన్నారు. కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఈ మధ్య పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు, పాకిస్థాన్ దళాల మధ్య కూడా పలుమార్లు ఘర్షణలు జరిగాయి. దీంతో పాకిస్థాన్ పట్ల అక్కడి ప్రజల్లో వ్యతిరేక భావన నెలకొందనే విశ్లేషణలు మరోసారి ఊపందుకున్న విషయం తెలిసిందే.