ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎదో ఒక చోట అన్యాయం , అక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు బ్రోకర్ దందా రాజ్యమేలుతోందని చెప్పాలి. అసలు విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఎచ్ .పి గ్యాస్ ఏజెన్సీల ఆగడాలు హద్దులు మీరుతున్నాయి. అయితే ఒక సిలిండర్ ధర 850 రూపాయలు కాగా ఇక్కడ 1000 రూపాయల నుండి 1200 వరకు అమ్ముకుంటూ బ్లాక్ దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే అధికారులు, నాయకులూ ఏం చేస్తున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. లేక అధికారులు ,నాయకులు కుమ్మక్కై సామాన్య జనాలతో ఆడుకుంటున్నారా అంటూ నిలదీస్తున్నారు. మార్కెట్ లో కూరగాయలు అమ్మినట్టుగా ఇక్కడ బ్లాక్ లో ఎచ్ , పి గ్యాస్ సిలిండర్ లు అమ్మటం విడ్డూరంగా కనిపిస్తుంది. ఈ బ్లాక్ లో కూడా జనాలు క్యూ లైన్ లో నిలబడి కొంటున్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారం పై తక్షణమే చర్యలు ట్టేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పని చేసుకుంటే గడవని కుటుంబాలు ఇక్కడ క్యూ లైన్ లో నిలబడటంతో ఆ రోజు పని లేకుండా పోతుందని వాపోతున్నారు. బొల్లారంలో 10 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా ఎచ్ గ్యాస్ ఏజెన్సీ బ్యాక్ సైడ్ లో ఈ బ్లాక్ దందా కొనసాగిస్తున్నారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు , నాయకులు తక్షణమే స్పందించి గ్యాస్ సిలిండర్ ని ఇంటింటికి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.