ఇటీవల గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రదాన నగరాల్లో పాఠశాలలు, ఆస్పత్రుల్లో బాంబులు పెట్టామంటూ ఆకతాయిల నుంచి బెదిరింపు కాల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తామని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ బెదిరింపులకు పాల్పడుతూ ఓ ఆడియోను విడుదల చేయడంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. అయోధ్య పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన అధికారులు అనుమానితుల కదలికలపై నిఘాపెట్టారు.. అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయం, రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచినట్టు జిల్లా ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ తెలిపారు. రామ మందిరం చుట్టుపక్కల కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని, జోన్ల వారీగా విభజించి, భద్రతా సిబ్బందిని మోహరించినట్లు పేర్కొన్నారు. జైషే మహ్మద్ పేరుతో విడుదలైన ఆడియోలోని వ్యక్తి తనను తాను అమీర్‌గా పరిచయం చేసుకుని.. మసీదును కూల్చివేసి ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నాడని పోలీసులు అన్నారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని కూల్చివేయాల్సి ఉందని.. అందుకోసం ఇప్పటికే తమ సహచరులు ముగ్గురు బలిదానం చేశారని ఆ ఆడియోలో అన్నట్లు తెలిసింది. బాంబులు వేయబోతున్నారని ఆ ఆడియో టేపుల్లో బెదిరింపులకు దిగడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయితే, అయోధ్యలోని బాబ్రీ మసీదు- రామమందిర వివాదం మొదలైనప్పటి నుంచి ఆ ప్రాంతం భద్రతవలయంలో కొనసాగుతోంది. కాగా అయోధ్య మందిరం ప్రారంభమైన తర్వాత మరింత భద్రతను ఏర్పాటుచేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో సెక్యూరిటీని రెండింతలు పెంచారు. 2005లో లష్కరే తొయిబా ఉగ్రవాదులు దాడికి చేసిన ప్రయత్నాలను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. అయితే ఇప్పుడు పాక్ ఉగ్రవాద సంస్థ బెదిరింపుల ఆడియో తీవ్ర కలకలం రేపుతోంది