మెగా ఫ్యామిలీ- అల్లు కుటుంబం మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఏపీ న్నికల వేళ ఈ రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌కి మద్దతు తెలుపుతూ రామ్ చరణ్ అక్కడికి వెళ్లారు. అయితే అదే రోజు అదే సమయానికి అల్లు అర్జున్.. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌కి సపోర్ట్ చేయడానికి నంద్యాలకు వెళ్లడం మెగా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. తన ఫ్రెండ్ అయిన రవిచంద్రకి మద్దతు ఇవ్వడానికి వచ్చానంటూ బన్నీ పైకి చెప్పినా పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం ఎందుకు వెళ్లలేదని మెగా ఫ్యాన్స్ గట్టిగానే సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి మెగా ఫ్యామిలీ తరఫున దాదాపు అందరూ హాజరయ్యారు. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు. ఇంతవరకూ పక్కన పెడితే ఈ కార్యక్రమం వేళ మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. సోషల్ మీడియాలో బన్నీని అన్‌ఫాలో చేశారు. ఇటు ఇన్‌స్టాగ్రామ్, అటు ట్విట్టర్ లో కూడా అల్లు అర్జున్‌ని సాయి తేజ్ అన్ ఫాలో చేశారు. అయితే అల్లు శిరీష్‌ను మాత్రం ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మళ్ళీ మెగా ఫ్యాన్స్ Vs అల్లు అభిమానుల మధ్య వార్ మొదలైపోయింది. బన్నీకి ఇలా కావాల్సిందేనని , మెగా ఫ్యామిలీ దూరం పెట్టడంలో తప్పు లేదంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అయితే సాయి తేజ్ అన్‌ఫాలో చేసినంత మాత్రాన మా బన్నీకి పోయేదేం లేదంటూ మరోపక్క అల్లు అర్జున్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. మొత్తానికి సాయి తేజ్ చేసిన అన్‌ఫాలో మరోసారి రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలకి బలాన్ని ఇచ్చింది.