ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. రేపటి (18) నుంచి 23 వరకు కస్టడీకి అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి నాగ్‌పాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 7 రోజులపాటు ప్రశ్నించనున్నారు. ఈ వారం రోజులపాటు కవిత ఈడీ కార్యాలయంలోనే ఉండాల్సి ఉంటుంది. 7 రోజుల పాటు ప్రశ్నించిన అనంతరం మార్చి 23న మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

కాగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని నివాసంలో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించారు. శనివారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు.