తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ సర్కారు తెలంగాణ మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే మహిళల అకౌంట్లలోకి నెలనెలా 2500 రూపాయలు వేసేందుకు సిద్ధమవుతోంది. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన 18 ఏళ్లు నిండిన ఆడవాళ్లకు ప్రతి నెలా 2500 ఆర్థిక సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి మహిళకు నెలనెలా 2500 రూపాయల చొప్పున గౌరవ భృతి అందిస్తామని , ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధమయ్యాయిని.. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ హామీపై స్పందిస్తూ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ ఖాతాల్లో నెలనెలా 2500 రూపాయలు జమకానున్నాయని స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక సాయం విషయంలో తమ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని, అయితే సర్కారు నుంచి ఎటువంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెలనెలా ఈ 2500 రూపాయలు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ పథకాన్ని జులై నుంచి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.