జూన్ 27న విజయవాడలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా ‘రామోజీరావు సంస్మరణ సభ’ నిర్వహించారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ రామోజీరావు జీవితం నిరంతర ప్రవాహం అని, ఆయన జీవితం గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జర్నలిస్టు విలువలను కాపాడిన రామోజీ రావు ప్రజల పక్షపాతని పవన్ కళ్యాణ్ కొనియాడారు. తాను సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో తనకు ప్రత్యక్ష అనుబంధం లేదని.. 2008లో తాను నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడానని ఆయన గుర్తుచేశారు. 2019లో తనను లంచ్ మీటింగ్‌కు రామోజీరావు ఆహ్వానించారని తెలిపారు. ‘దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు, పత్రికా రంగం గురించి మా మధ్య చర్చ జరిగిందని, నువ్వు ఏం చేస్తావో, ఏం నమ్ముతావో దాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి చేయి అని తనకు రామోజీరావు సూచించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఈ దేశానికి రామోజీరావు చాటి చెప్పారని, జనం తాలూకూ అభిప్రాయాలే ఆయన పేపర్లో ప్రతిబింబించేవని పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘పేపర్ ఒక్కటే నడపటం చాలా కష్టసాధ్యం. కానీ, విలువలతో రామాజీరావు ముందుకు సాగారని, అలాంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసని పవన్ కళ్యాణ్ అన్నారు. తన వ్యాపారాలపై దాడులు చేసినా, కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకున్నా.. రామోజీరావు తట్టుకొని నిలబడ్డారని, జర్నలిస్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగారని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాచార హక్కు చట్టం గురించి ఉద్యమకర్తగా పోరాడారని కొనియాడారు. స్టూడియోలు కట్టినా, సినిమాలు చేసినా.. రామోజీరావు ఆదర్శ భావాలు పాటించారని చెప్పారు. ఇలా దైర్యంగా నిలబడటానికి చాలా ధైర్యం కావాలని పేర్కొన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి రామోజీ రావు విగ్రహన్ని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.