జనసేనాని పవన్ సమక్షంలో ఇవాళ పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. 

రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, వ్యాపారవేత్త చిక్కాల దొరబాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ ఓనర్ల సంఘం అధ్యక్షుడు, వైసీపీ ట్రేడ్ యూనియన్ నేత దుగ్గన నాగరాజు, డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు కలగా పాల్ పురుషోత్తం తదితరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు వారి అనుచరగణం కూడా జనసేనలో చేరింది. 

ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టినప్పుడు మాట మీద నిలబడకపోవడం వల్ల అవమానాలు ఎదుర్కొన్నామని వెల్లడించారు. జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఆ విషయంలో ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. తెలుగు ప్రజల ఐక్యతకు కట్టుబడి ఉన్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర క్షేమం కోసమే పోటీ చేయలేదని పునరుద్ఘాటించారు. 

తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండా ఎగురవేస్తానని పేర్కొన్నారు. తన ప్రాణం పోతే భావితరాలు పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.