ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యటించబోతోండటం ఇదే తొలిసారి. ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. దాని తరువాత తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి వెళ్లనున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో మాల ధారణ చేశారు. 11 రోజులపాటు నిష్ఠగా దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో ఆహారంగా పాలు, పండ్లు, ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది కూడా ఆయన ఇదే దీక్ష చేశారు. కాగా దీక్షలో భాగంగా ఈ నెల 29వ తేదీన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. తమ ఇంటిదైవం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించనున్నారు. ఇదివరకు ఇదే ఆలయాన్ని సందర్శించిన పవన్ వారాహి వాహనానికి పూజలు చేయించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు. దీని తరువాత కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పవన్ కల్యాణ్. పర్యటిస్తారు. జులై 1వ తేదీన ఆయన పిఠాపురం పర్యటన షెడ్యూల్ ఖరాఋ కాగా ఆ రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో ప్రసంగిస్తారు. కృతజ్ఞత సభను నిర్వహిస్తూ తనను భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలను తెలియజేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలపై అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం, నియోజకవర్గ అభివృద్ధి, ఓటర్ల సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను జారీ చేస్తారు. అలాగే- మూడు రోజుల పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పవన్ పాల్గొననున్నారు.