యువగళం పాదయాత్రలో ఓ విద్యార్థి ఆవేదనను విన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… ఆ తమ్ముడ్ని చదివించే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అమలాపురం నియోజకవర్గం భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి నిర్వహించిన లోకేశ్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా అమలాపురం నియోజకవర్గం కోడుపాడుకు చెందిన కె.దుర్గారెడ్డి తమ కష్టాలను లోకేశ్ కు తెలియజేశాడు. “నేను అమలాపురంలోని ఎస్ కేబీఆర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ హెచ్ఈసీ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. అక్కడ సరైన సదుపాయాలు లేక చదువు మానేశాను. తర్వాత ఐటీఐ చదువుతానని నాన్నతో చెబితే … మనకు అంత స్థోమత లేదు, వద్దన్నారు. దాంతో టీసీ తీసుకొని ఇంటి వద్దే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను” అని చెప్పాడు.

దీంతో లోకేశ్ స్పందిస్తూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపేసిన దుర్గారెడ్డిని తాను చదివిస్తానని అక్కడిక్కడే ప్రకటించారు. అంతేకాదు, ఆ విద్యార్థి వివరాలు తీసుకోవాల్సిందిగా వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు.