టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మళ్లీ షురూ అయింది. తుపాను కారణంగా నిలిచిపోయిన పాదయాత్ర ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలోని శీలంవారి పాకలు జంక్షన్ నుంచి ప్రారంభమైంది. అనంతరం పాదయాత్ర తుని నియోజకవర్గంలోకి ప్రవేశించింది. తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద లోకేశ్ కు ఘనస్వాగతం లభించింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. 

పెరుమాళ్లపురం వద్ద లోకేశ్ స్థానిక మత్స్యకారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులు తమ సమస్యలను లోకేశ్ కు వివరించారు. వేటకు వెళ్లి చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, వేటకు వెళ్లి చనిపోతే డాక్టర్ సర్టిఫికెట్ అడుగుతున్నారని తెలిపారు. తమకు ఉపాధి కల్పించే వలల ధరలు బాగా పెరిగిపోయాయని, అధికారంలోకి వచ్చాక వలల ధరలు తగ్గేలా చూడాలని లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు.