ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాభవన్‌లో ఈరోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి మాట్లాడుతూ… ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని అన్నారు. ఈ రోజు 5126 దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో చాలామంది సొంత ఇల్లు లేదని వచ్చినట్లు వెల్లడించారు. నిరుద్యోగులూ ఎక్కువ సంఖ్యలో వచ్చారన్నారు. వాళ్ల సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. 

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని.. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆటో వాళ్ళు మా సోదరులేనని, వాళ్ళకు కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని సూచించారు.