సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొల్లాపూర్‌లో బర్రెలక్క కర్నె శిరీష తరఫున ప్రచారం నిర్వహించారు. శనివారం ఆయన స్వయంగా కొల్లాపూర్‌కు వెళ్లి ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మన వద్ద పార్టీస్వామ్యం పోయి ప్రజాస్వామ్యం రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శిరీష లాంటి వారు అవసరమన్నారు. శిరీష ఎమ్మెల్యే అయితే మొదట ఆనందపడేది తానే అన్నారు. ఇలాంటివాళ్లు ఎందరికో రోల్ మోడల్ అవుతారన్నారు. చాలామంది పని చేశారు… చాలా పార్టీలు పని చేశాయి.. కానీ మనం కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్నారు. యానాం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాడి కృష్ణారావు ఎల్లుండి ఇక్కడకు వస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమైన అంశమన్నారు. శిరీష ఈ స్థాయికి రావడానికి కారణం సోషల్ మీడియా అని, కాబట్టి దానిని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. శిరీషకు ఈల గుర్తు వచ్చిందని, ఇది తనకు బాగా నచ్చిందన్నారు. దీంతో మనం అందరినీ జాగృతం చేయాలన్నారు. మీరు శిరీషను అసెంబ్లీకి పంపిస్తే ఇక్కడ వేసే ఈలలను అక్కడ సభలో ఈల వేసి వినిపిస్తుందని వ్యాఖ్యానించారు.